Tuesday, June 12, 2012

నలుగురి కోసం నారాయణ - Newspaper article on KN


కాసాని నారాయణ... ఆయన జీవితం 2005లో ముగిసింది
కానీ అంతకుముందంతా ఆయన బతుకు ప్రజలతో, ప్రజాసేవతో గడిచిపోయింది
సాధారణంగా మొదలైన ఆయన జీవితం అసాధారణంగా ముగిసింది
పోరాట వీరుడి నుంచి స్వాతంత్య్ర సమరయోధుడిగా, శాసన సభ సభ్యుడిగా ఆయన జీవితంలో అనేక కోణాలున్నాయి రాజకీయనాయకుడిగా పనిచేసినా ఓ నాయకుడిగానే ఉండిపోయాడు కానీ ‘రాజకీయం’ చేయలేదెక్కడా. ఆయన వారసులకు ఆయనిచ్చిన సంపద, సలహా ‘రాజకీయాలు చేయకండి. నిజాయితీగా బతకండి’ అనీ! ఆయన పెద్ద కొడుకు ఆనందం కాసాని అదే మాట చెప్తాడు...‘మా నాన్నే మాకు ఆదర్శం. ఆయన బాటలోనే పయనిస్తున్నాం’ అని!


‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను బాగానే గమనించాను. ఆయన ప్రవర్తన, మనస్తత్వం అన్నిట్నీ శ్రద్ధగా చూస్తుండేవాణ్ణి. నా జీవితం మీద ఆయన ప్రభావం ఉంది. అయితే దాన్ని ప్రభావం అనేకంటే ఆయన స్ఫూర్తి అని చెప్తే బాగుంటుంది. ఇంట్లో అమ్మతోనే కాదు అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండేవాడు. మమ్మల్ని సినిమాలు, ఫంక్షన్లకు కూడా తీసుకెళ్లేవాడు. అందుకే ఆయన మాకు తండ్రి మాత్రమే కాదు స్నేహితుడు కూడా అనుకుంటాం. ఏదైనా ఒక సమస్య వస్తే నాలుగు పరిష్కారాలు చూపించేది నాన్న. ఇప్పుడు మేము కూడా అంతే. మాకే సమస్య వచ్చినా నాన్నగారైతే ఈ సమస్యను ఎలా పరిష్కరించేవారో ఆలోచించి మరీ మా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకుంటం. ఇంట్లో నేనే పెద్దవాణ్ణి కాబట్టి నాన్నతో చాలా విషయాలే మాట్లాడేవాణ్ణి. అందుకే నాకు బాధ్యతలు తెలిశాయి. సమాజమూ అర్థమైంది. నేను చాలా పుస్తకాలు చదివాను, చాలామంది గొప్ప వ్యక్తుల గురించి విన్నాను, తెలుసుకున్నాను నాకు మాత్రం మా నాన్నే ఆదర్శం, స్ఫూర్తి... అన్నీ!
Narayan0 talangana patrika telangana culture telangana politics telangana cinema
అబద్ధం చెప్పేవాడు కాదు
నాన్న చాలా సిన్సియర్‌గా ఉండేవాడు. ఎమ్మెల్యే అయినప్పటికీ సాదాసీదా జీవితమే గడిపాడు. 1972 ఎన్నికలప్పుడు జనగామ నియోజక వర్గం నుంచి గెలిచాక హైద్రాబాద్ షిప్ట్ అయ్యింది మా కుటుంబం(కమ్యూనిస్టుగా ఉన్నప్పుడే నాన్నకు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చింది కానీ పదవులపై ఆశ లేకపోవడంతో వద్దనుకున్నాడు. కానీ ఆ తరువాత పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది). ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. అప్పట్లో జూబ్లీహిల్స్‌లో ప్లాట్స్ ఇచ్చినప్పుడు ఇళ్లున్నవాళ్లు కూడా అబద్దం చెప్పి అక్కడ ప్లాట్లు తీసుకున్నారు ఒక్క నాన్న తప్ప. ఎందుకంటే అప్పటికే మాకొక ఇల్లు ఉండింది. (ఆ మాటకొస్తే అప్పుడు ప్లాట్లు పొందిన ఎమ్మెల్యేలందరూ బంగ్లాలు, భవంతులు ఉన్నవాళ్లే). అందుకే అబద్దం చెప్పడం ఇష్టంలేక నాన్న అక్కడ ప్లాటు కాదనుకున్నాడు. నాన్న నుంచి నేర్చుకోవాల్సింది కూడా అదే. ప్రాణాలు పోయినా అబద్దాలు చెప్పేవాడు కాదు.

నిజం చెప్పాలంటే ఒక్క పెన్షన్ తప్పితే ఒక ఎమ్మెల్యేగా నాన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం పొందలేదు. ప్రజా సమస్యలపై, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం తపిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాలా అని కసరత్తులు చేస్తుండేవాడు. అందుకే ఎన్నోసార్లు ఫంక్షన్లకు, పెద్ద పెద్ద పండగలకు కూడా ఇంట్లో ఉండకపోయేవాడు. అలాంటి కొన్ని సంఘటలు గుర్తుచేసుకుంటే బాధనిపిస్తుంది కానీ, ఆయన ఆలోచనా దృక్పథం, ఆరాటం తెలుసు కాబట్టి మేము ఆయన్ని ఎదిరించలేదు. అమ్మ కూడా సర్దుకుపోయేది తప్ప ఎప్పుడూ నాన్నను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆయన జీవన విధానంలో ఫ్యామిలీకంటే ప్రజలకే ఎక్కువ స్థానం ఇవ్వడం వల్ల మాకు పుష్ అప్ లేకుండా పోయిందని బాధపడేవాణ్ణి నేను. కానీ తరువాత్తర్వాత నిజాయితీగా బతకడం, ప్రజా సేవలో జీవించడం ఎంత తృప్తినిస్తుందో అర్థం చేసుకోగలిగాం. అందుకేనేమో నాన్న మాకిది తక్కువ చేశాడని మేమెప్పుడూ అనుకోలేదు.

అమ్మానాన్నలది మేనరికం. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేవారు. నాన్న చనిపోయి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతున్నా అమ్మా ఇంకా డిప్రెషన్‌లోనే ఉంది. ఇంతమందిమి ఉన్నా కూడా ఆమెను ఆ స్థితి నుంచి బయటకు తీసుకురాలేకపోయాం. ఆయన జ్ఞాపకాలతోనే గడుపుతుంది అమ్మ. అయినా నాన్న మా మధ్యనే ఉన్నాడనే అనుకుంటాం. మా ప్రతి పనిలోఆయన ప్రభావం ఉంటుంది. చెల్లెలు ఝాన్సీతో సహా ప్రస్తుతం అందరం వెల్‌సెటిల్డ్. అయితే లైఫ్‌లో సక్సెస్ అయ్యామా? అంటే కాలేదని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పటి జనరేషన్‌కు ఉండవలిసిన వేగం మా జీవన విధానంలో లేదు. అందుకే అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. ఇంకా ఏదో సాధించాలనే ఆలోచన కలుగుతుంటుంది.

ఓడి గెలిచాడు
1978లో రెండోసారి ఎన్నికలు. ఈ సారి కూడా నాన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. ప్రజలకు దగ్గరగా ఉంటూ అనేక సమస్యలు పరిష్కరిస్తూ, సౌకర్యాలు అందిస్తూ ఉన్న వ్యక్తి అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. అసలు ఎందుకలా జరిగిందంటే, అప్పట్లో నారాయణ సమకాలీనులుగా పీవీ నరసింహరావు, చెన్నమనేని, హయక్షిగీవాచారి, టి. పురుషోత్తమరావు వంటి వాళ్లుండేవారు. అప్పటికి ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటయ్యింది. అంతకుముందు వీళ్లంతా రెడ్డి కాంగ్రెస్‌లో ఉండేవాళ్లు. ఆ పార్టీ గుర్తు ఆవుదూడ. కానీ ఇందిరా కాంగ్రెస్ చేయిగుర్తును తెచ్చింది. పైగా అందులో చేరినవాళ్లంతా రెడ్డి కాంగ్రెస్ నేతలే. అయితే ఈసారి పార్టీ మారడం ఇష్టం లేక రెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు నాన్న. ప్రజలకు నాన్న ఏ కాంగ్రెస్‌లో ఉన్నారో అర్థం కాలేదు. పైగా ఆయనతో ఉన్నవాళ్లంతా చేతిగుర్తు పార్టీకి మారారు. దాంతో గందరగోళంలో పడిన చాలామంది జనం నారాయణరావుది చేయి గుర్తుగా భావించారు. ఓట్లన్నీ అటే వెళ్లాయి. ఓడక తప్పలేదు. కానీ ఆ టర్మ్‌లో గెలిచిన అభ్యర్థి అభివృద్ధి చేయడానికి అక్కడ పనులు కనిపించలేదు. అప్పటికే నాన్న చేసేశాడు. అందుకే పీవీగారు ‘నారాయణ ఓడి గెలిచాడు’ అని ప్రశంసించారు నాన్నను.

నేనూ ప్రయత్నించాను
నాన్న ఓడిపోయిన తరువాత మళ్లీ రాజకీయం మాట ఎత్తలేదాయన. అయితే అక్కడి ప్రజలు మాత్రం మా ఫ్యామిలీని బాగా ఆదరించేవారు. నన్ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా సలహాలు, సూచనలు ఇచ్చారు. నేనూ ప్రయత్నించాను కానీ వర్కవుట్ కాలేదు. అందుకే వదిలేశాను. ఆ ప్రయత్నం విఫలమైన తరువాత నా వ్యక్తిగత జీవితమే గొప్పగా కనిపించింది నాకు. ‘నిజాయితీగా బతికే అవకాశం రాజకీయాల్లో ఉండదు’ అని నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో నా దృష్టంతా వ్యాపారం వైపు మళ్లించాను. స్వాతంత్య్ర సమరయోధుల పథకం కింద నాన్న పేరు మీద గ్యాస్ ఏజెన్సీ శాంక్షన్ అయ్యింది మాకు. ఇక అప్పట్నుంచి అది చూసుకోవడమే. నేను, మా తమ్ముడు అశోక్.... ఇద్దరమూ కలిసే పనిచేసుకుంటున్నాం. ఉన్నదాంట్లోనే హ్యాపీగా ఉంటున్నాం.

నాకు చరిత్ర ఉంది
నిజం చెప్పాలంటే ఇప్పటికీ నేను ఎక్కడా ఎక్స్ ఎమ్మెల్యే కొడుకును అని చెప్పుకోను. కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తే మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, ఎక్స్ ఎమ్మెల్యే అప్పట్లో.... అని చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు రాజకీయనాయకుల నిజాయితీ ఏపాటిదో అందరికీ తెలిసిందే. అందుకే నాన్నను వాళ్లలో కలపడం ఇష్టంలేక అలా చెప్తాను.

నేను గొప్పగా చెప్పుకునే విషయం ఏమిటంటే... ఇప్పటి రాజకీయ నాయకుల వారసులకు సిరిసంపదలున్నాయి. చరిత్ర లేదు. కానీ నాకు చరిత్ర ఉంది. నా వెనక నాన్న ఉన్నాడు. ఆయన నిజాయితీ ఉంది. ఆయన నిరాడంబర జీవితం ఉంది. ఆయన అందించిన స్ఫూర్తి ఉంది’

Somaiah05 talangana patrika telangana culture telangana politics telangana cinema కాసాని నారాయణ గురించి...
ఆంధ్రవూపదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో కాసాని నారాయణ కూడా ఒకరు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. పధ్నాలుగేళ్లకే సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరుడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన ఉడుకురక్తం ఆయన. ఉత్తేజ పరుచగల వక్త కూడా. వరంగల్ జిల్లాలోని దేవరుప్పుల గ్రామం ఆయనది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టినవాడే. అప్పట్లో ఆ ఊళ్లో చదువుకున్న అతి తక్కువ మందిలో నారాయణ తండ్రి రామయ్య ఒకరు. అందుకే నారాయణ కూడా ఐదో తరగతి దాకా చదువుకోగలిగాడు. చురుకుగా ఉండేవాడు. ఎంతోమంది గొప్పవాళ్ల ప్రబోధాలు, ప్రసంగాల వల్ల ఉత్తేజితుడైన నారాయణ నిజాం పాలనపై వ్యతిరేకత పెంచుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో ఆంధ్రమహా సభ, కమ్యూనిస్టు పార్టీలో కీలక కార్యకర్తగా మారాడు. జనాన్ని పోగు చేయడం ఒక పనిగా పెట్టుకున్నాడు. 1946లో రజాకార్లు నారాయణ గ్రామంపై దాడిచేసి 440 మందిని అరెస్టు చేసి చెంచల్‌గూడ జైళ్లో నిర్భందించారు. ఆ సమయంలో నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించాడు నారాయణ.

అప్పటికి ఆయన వయసు పందొమ్మిది సంవత్సరాలు. నిజాం పాలనలో ఉరిశిక్ష పడ్డప్పుడు అవకాశం ఉన్నా క్షమాభిక్ష అడగటానికి కూడా ఒప్పుకోలేదు ఆయన. కమ్యూనిస్టు పార్టీ ఆదేశంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా నారాయణ చేస్తున్న కార్యక్షికమాలు పెరగడం వల్ల అతనిపై నిర్భందం పెరిగింది. ఆ సమయంలో ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది(ఆయన జీవితంలో రెండున్నర సంవత్సరాలు జైలు, ఐదు సంవత్సరాలు ఆజ్ఞాతవాసం ఉన్నది). నారాయణ పటిష్టమైన పోరాట దళాలను నిర్మించాడు. ఆయన దళనాయకుడిగా, కేంద్ర దళ కమాండర్‌గా, జోనల్, ఏరియా దళకమాండర్‌గా వివిధ స్థాయిల్లో పనిచేశారు. నారాయణపై జెజె తిరుమల్‌రావు పీహెచ్‌డీ చేయడం, మల్లికార్జున శర్మ పుస్తకం రాయడం మరో విశేషం.

somaiah talangana patrika telangana culture telangana politics telangana cinemaకాసాని నారాయణ స్పూ ర్తి
కాసాని నారాయణ ఆయనకు తెలియకుండానే తన చిన్నతమ్ముడైన కాసాని సోమయ్య మీద చాలా ప్రభావం చూపాడు. నారాయణ సాయుధ పోరాటంలో పాల్గొనేటప్పటికి సోమయ్య వయసు ఏడేళ్లు. అంత చిన్న పిల్లలను నిజాం మిలిటరీ అనుమానించదు కాబట్టి బయట పరిస్థితులను తన అన్న దళానికి చేరవేసేవాడట. తన వయసు పిల్లలను కూడదీసుకుని మిలిటరీ కదలికలను గమనిస్తూ తన అన్నకు ఉప్పందించేవాడు. అంతేకాదు చిన్న చిన్న వ్యూహాలనూ రచించేవాడట. అలా నాటి స్ఫూర్తిని నేటికీ కొనసాగిస్తున్నాడు సోమయ్య. ఆయన పిల్లల అవసరాలరీత్యా కెనడాలో స్థిరపడినా, అక్కడి రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నాడు.

కెనడాలోని తెలుగు కమిటీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నాడు. ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్‌కు సెక్రటరీగా, ఇండియన్ కౌన్సిల్‌లో కమిటీ మెంబర్‌గా, ‘అంకూర్’ అనే మల్టీ కల్చరల్ అసోసియేషన్‌కి వైస్ ప్రెసెడెంట్‌గా పలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ రోజు తను చేస్తున్న ఈ పనులన్నిటికీ అన్న నారాయణే ప్రేరణ అంటాడు సోమయ్య! ఈ సందర్భంగా తన అన్నను గుర్తు చేసుకుంటూ నాటి స్మృతులను ఇలా పంచుకున్నాడు....‘నిజానికి సాయుధ పోరాటంలో చేరడానికి అన్న చాలా కష్టపడ్డాడు. ఈ మాట వింతగా ఉండొచ్చు. కానీ ఇదే వాస్తవం. కారణం...అప్పట్లో మా ఊళ్లో బేతు కృష్ణాడ్డి, అబ్బాస్ అలీ నిజాం ఏజెంట్స్‌గా ఉండేవారు. మా నాన్నేమో ఊరికి పెద్దలా వ్యవహరించేవాడు. అయితే కృష్ణాడ్డి, అబ్బాస్ అలీ నాన్నతో క్లోజ్‌గా ఉండేవారు.

దీంతో మా ప్రాంతంలోని సాయుధ పోరాట వీరులంతా నాన్నను కూడా నిజాం ఏజెంట్‌గానే అనుమానించారు. అందుకని అన్న ఉత్సాహంగా, నిజాయితీగా ఉన్నా ఆయనను నమ్మకపోయేది వాళ్లు. వాళ్ల నమ్మకం కోసం అన్న ఎన్ని పాట్లుపడేవాడో! వాళ్లు దూరం పెట్టినా బాధపడకుండా ప్రతి పనిని బాధ్యతగా చేసి వాళ్ల దృష్టిలో పడాలని తాపవూతయపడేవాడు. ఇదంతా తెలంగాణ మీద, సాయుధ పోరాటం మీద ఆయనకున్న గౌరవం, నమ్మకం! అదే నిజాయితీ, అంతే నిబద్ధతను ఆయన జీవితాంతం కొనసాగించాడు. అంతెందుకు అన్న ఎమ్మెల్యే అయినా....ఏ నాయకుడి కొమ్ము కాయలేదు. సామాన్య జనపక్షపాతిగానే ఉన్నాడు. ఎమ్మెల్యే హోదాని అడ్డం పెట్టుకుని ఆయన మా కుటుంబానికే కాదు తన సొంత పిల్లలకు కూడా రవ్వంత ఫేవర్ చేయలేదు.

అందుకే పీవీలాంటి వాళ్లంతా అన్నను బాగా గౌరవించేవారు. ఎమ్జన్సీ టైమ్‌లో రాష్ట్రంలో మహామహులున్నప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందో అన్ననే అడిగి తెలసుకునేవాడు. అన్నంటే అంత ట్రస్ట్ ఉండేది ఆయనకు. ఒకసారి రాష్ట్రంలోని పెద్ద నాయకులే ‘ఏమయ్యా! ఎంత సేపు జనం కోసమేనా..నీ కోసం, నీ వాళ్ల కోసం కూడా ఏమైనా ఫేవర్ చేసుకో’ అన్నారట. ‘ప్రజలకుంటే మనకున్నట్టే కదా’ అని నవ్వి ఊరుకున్నాడట. ఇట్లయితే లాభం లేదని...అన్న అనుచరులను అడిగారట నాయకులు..‘ఈయన పిల్లలు ఏం చేస్తున్నారు? అసలు ఈయనకేముంది’ అని! అప్పుడు అన్న పక్కనున్న ఆయన ‘ సర్...నారాయణ సర్‌కి ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్ లేదు. కొంచెం ఇప్పించండి సర్’ అని రిక్వెస్ట్ చేశాడట. అప్పుడు అన్నకు గ్యాస్ కనెక్షన్ శాంక్షన్ అయింది. అదీ దాదాపు ఆయన ఎమ్మెల్యే టర్మ్ అయిపోతున్న టైమ్‌లో! అంత నిరాడంబరంగా బతికాడు అన్న’ అంటూ నారాయణ వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకున్నాడు ఆయన తమ్ముడు సోమయ్య.