Friday, July 20, 2007

ప్లాన్ ప్రకారం పనులు చేయడంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు.

చాలామంది ప్లానులు ఘనంగా వేస్తారుకాని ఆచరించరు. ప్లాను వెయ్యటం కంటే దాన్ని ఆచరించటం చాలా ముఖ్యం. ప్లానును కాగితాలకే పరిమితం చెయ్యకుండా ఆచరించటం అలవాటు చేసుకోండి.
గడియారం ముల్లు తరుముతున్నట్లు హడావుడిగా ఉండటం నేర్చుకోండి. అలాగని చేసేపనులు చెడగొట్టుకోకూడదు. పనుల మధ్య సమయాన్ని, టీ, కాఫీల సమయాన్ని, బాతాఖానీల సమయాన్ని తగ్గించేయండి.


ఈ విధంగా ప్లాన్ ప్రకారం పనులు చేస్తూ ఉంటే ఏదో కొత్త జీవితం ప్రారభించిన ఫీలింగ్ వస్తుంది. భయపడకండి. ఈ కొత్త జీవితంలో మీరు ఇంతకు ముందుకన్నా సుఖంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొత్త జీవితాన్ని ఆహ్వానించడానికి మానసికంగా సిద్ధంకండి.
ఏ రోజు పనులను ఆ రోజు విశ్లేషించి ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోండి. వాటిని సవరించుకునే ప్రయత్నం చేయండి.

ఈ రోజు ప్లాన్లో ఉన్న పనిని రేపటికి వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. రేపటి పనులు దెబ్బతింటాయి. ఏదైనా పనిని వాయిదా వేయాల్సి వస్తే దాని స్థానంలో ఇంకో పనిని చేయండి. ఒకరోజు మొదలు పెట్టిన మీ ప్లాన్‌ను రెండు రోజులకి, తరువాత మూడు రోజులకి పెంచే ప్రయత్నం చేయండి. చివరికి ఒక వారం రోజులకి సరిపడ ప్లాన్‌ను తయారు చేసుకుని దానిని ఆచరించేందుకు సిద్దం కండి. అయితే అప్పుడు కూడా రోజువారీ ప్లాన్‌లను తయారుచేసుకోవడం మర్చిపోకండి.