Tuesday, January 22, 2008

అనగనగా ఓ కధలా ఆ నిన్నకి సెలవిస్తే!

ఈ రోజు ఇలా చాల రోజుల తర్వాత పండగ సందడితో వచ్చేసాను.. అసలు పండగ సందడంటే గుర్తోచ్చొంది .. అసలేమి పండగలండీ బాబు!! అందరూ ఎంతో కృత్రిమంగా చెయ్యాలి కాబట్టి అనే రీతిలో చేస్తున్నారు. కాని ఎవరి ముఖకవళికలలోను ఉత్సాహం అనేది మచ్చుకైనా కనపడటం లేదు..

హు! ఎవరిదాకో ఎందుకు?? మా కుటుంబాన్నే తీసుకొంటే.. హమ్మయ్య ఓ రెండురోజులు ఆఫీస్ కి సెలవు అనే మాట తప్పితే ముగ్గుల హడావిడి .. పిండివంటల హడావిడి అస్సలు కనిపించలేదు.. ఎంతో యాంత్రికంగా అనిపించింది.

ముగ్గులు పెట్టడానికి తీరిక పిండివంటలు చేయడానికి ఓపిక కరువయ్యాయి.. మా పాపని ముగ్గెయమ్మా అంటే.. అసలు ఆ ముగ్గు పిండి ఎలా పట్టుకొంటారో తెలియదంది... దాని పిచ్చి గాని అపార్ట్మెంట్లో ముగ్గు పెట్టడానికి ముగ్గెందుకో?? చిన్న చాక్ పీస్ వుంటే చాలు కదా.. అబ్బ!! నాకు రావమ్మా అని సణుగుడు..

సరె పండగ పిండివంటలు చెయ్యాలంటే.. అసలు అప్పుడు పెద్దవాళ్ళు ఎలా చేసార అని అనిపిస్తుంది.. బొబ్బట్లు అరిసెలు.. మొ! ఓ నాలుగు బొబ్బట్లు కాస్త పులిహోర.. కాస్త పరవాన్నం కనుమ రోజు కాస్త గారెలు... ఇది చాలులే పండగ అయ్యిందనిపించడానికి అనే అల్ప సంతోషం.. పిల్లలికి కొత్త బట్టలు ఇదేనా పండగంటే అని ఓ క్షణం అనిపించినా పట్నంలో ఇంతకన్నా ఏమి చేస్తాములే ఈ ఇరకాటంలో అని అనిపించకమానదు.... ఒకప్పుడు నెల ముగ్గు అంటూ నెల ముందు నుండే మొదలయ్యిన సంక్రాంతి పండగ సంభరాలు .. అవి గుర్తోస్తే అసలు జీవితమనేది ఎంత యాంత్రికంగా మనిషి మనిషిని పలరించుకొనే టైం కూడా లేకుండా గడిపోతోందా అని... పలకరిస్తే అవతలివారి ఆలోచనలు పక్కదారి పడ్తాయి..

ఏదో పని వుంటేనే మనని పలకరిస్తారు అన్న అపోహలో వుండే అవతలివారి వ్యాపార పరమైన ఆలోచనలు ఆ కాస్త పలకరింపుని కూడా సరి అయిన పద్ధతిలో అందుకోలేరు ..అసలంత దురదృష్టకరం ఇంకోటి వుండదేమొ అని ఒక్కోసారి అనిపిస్తుంది.

అందుకే అలా అన్నీ అనగనగా ఒక కధలా ఆ నిన్నకి విచ్చేద్దాము..

( I read this piece of story, this evening from our Telugu Paper - With Love, AmmaNaana)