Friday, February 12, 2010

క్రమ పరిణామాలు - డా. సి. నారాయణరెడ్డి

ఆ విత్తనం చిన్నదే కదా అని ఉపేక్షించొద్దు
పరిస్థితుల సముచిత దోహదంతో
ఆ విత్తనమే వృక్షమై నిలుస్తుంది

ఇది చినుకే కదా అని అనుకోవద్దు
ప్రకృతి రచించనున్న వర్షాకావ్యానికి
ఈ చినుకే తొలి పలుకు

ఇప్పుడు ఒక మహాత్ముని గుండెలా
నిండుగా ప్రవహించే జీవనది
ఒకప్పుడు ఏ కొండకోనల్లోనో
సన్నటి నీటిపాయగా తప్పటడుగులు వేసిందే

ఏ చరిత్రయినా చిటికెలో తయారు కాలేదు
అది ఎన్నెన్ని సంఘర్షణలను తట్టుకుని
ఎందరి త్యాగాలను ఊతకర్రలుగా పట్టుకుని
తరతరాలుగా కాలం విధించే అగ్రి పరీక్షలకు నిలిచి
మనదాకా తరలి వచ్చిందో

విడివిగా ఉన్నప్పుడు ఇటుకల విలువ తెలియదు
అవే సంఘటితంగా రూపొందితే మిద్దెలై మేడలై
మనల్ని విభ్రాంతుల్ని చేస్తాయి
ఎంతటి కొమ్ములు తిరిగిన విద్వన్మణియైనా
పసిప్రాయంలో అఆల స్తన్యం ఆరగించిన వాడే
ఉలిదెబ్బు పడందే ఏ రాయీ రమణీయ శిల్పాకృతి పొందదు

ప్రాథమిక దశను బట్టి
దేని అస్తిత్వానికీ అంచనా కట్టలేం
కాలమనే బృహత్ గ్రంథం పుటలు విప్పి
చదవగలిగితే
అన్ని క్రమపరిణామాల ఆద్యంతాలు
అవగతమవుతాయి