Thursday, April 23, 2020

కాసాని నారాయణ


           “ఆంధ్రవూపదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో కాసాని నారాయణ కూడా ఒకరు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. పధ్నాలుగేళ్లకే సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరుడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన ఉడుకురక్తం ఆయన. ఉత్తేజ పరుచగల వక్త కూడా. వరంగల్ జిల్లాలోని దేవరుప్పుల గ్రామం ఆయనది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టినవాడే. అప్పట్లో ఆ ఊళ్లో చదువుకున్న అతి తక్కువ మందిలో నారాయణ తండ్రి రామయ్య ఒకరు. అందుకే నారాయణ కూడా ఐదో తరగతి దాకా చదువుకోగలిగాడు. చురుకుగా ఉండేవాడు. ఎంతోమంది గొప్పవాళ్ల ప్రబోధాలు, ప్రసంగాల వల్ల ఉత్తేజితుడైన నారాయణ నిజాం పాలనపై వ్యతిరేకత పెంచుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో ఆంధ్రమహా సభ, కమ్యూనిస్టు పార్టీలో కీలక కార్యకర్తగా మారాడు. జనాన్ని పోగు చేయడం ఒక పనిగా పెట్టుకున్నాడు. 1946లో రజాకార్లు నారాయణ గ్రామంపై దాడిచేసి 440 మందిని అరెస్టు చేసి చెంచల్‌గూడ జైళ్లో నిర్భందించారు. ఆ సమయంలో నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించాడు నారాయణ.

అప్పటికి ఆయన వయసు పందొమ్మిది సంవత్సరాలు. నిజాం పాలనలో ఉరిశిక్ష పడ్డప్పుడు అవకాశం ఉన్నా క్షమాభిక్ష అడగటానికి కూడా ఒప్పుకోలేదు ఆయన. కమ్యూనిస్టు పార్టీ ఆదేశంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా నారాయణ చేస్తున్న కార్యక్షికమాలు పెరగడం వల్ల అతనిపై నిర్భందం పెరిగింది. ఆ సమయంలో ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది(ఆయన జీవితంలో రెండున్నర సంవత్సరాలు జైలు, ఐదు సంవత్సరాలు ఆజ్ఞాతవాసం ఉన్నది). నారాయణ పటిష్టమైన పోరాట దళాలను నిర్మించాడు. ఆయన దళనాయకుడిగా, కేంద్ర దళ కమాండర్‌గా, జోనల్, ఏరియా దళకమాండర్‌గా వివిధ స్థాయిల్లో పనిచేశారు. నారాయణపై జెజె తిరుమల్‌రావు పీహెచ్‌డీ చేయడం, మల్లికార్జున శర్మ పుస్తకం రాయడం మరో విశేషం.