Sunday, March 04, 2007

A Song on Telangana


నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా,
నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా

పారేటి నీల్లల్ల పానాదులల్ల
పూసేటి పూవుల్ల పూనాసలల్లా
పారేటి…
కొంగు సాపిననేల నా తెలంగాణా, నా తెలంగాణా
పాలుతాపిన తల్లి నా తెలంగాణా, నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

తంగేడు పువ్వుల్లు తంబాలమంతా
తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు
తంగేడు …
తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు
బంగారు చీరలు బాజారులన్ని
బంగారు…
బతుకమ్మ పండుగ నా తెలంగాణా, నా తెలంగాణా
బంతి పూల తోట నా తెలంగాణా, నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

వరద గూడు కడితె వానొచ్చునంటా
బురద పొలము దున్ని మురిసున్నరంతా
వరద …
శివుని గుల్లే నీల్లు చీమలకు శెక్కరి
వానకొరకు భజన జడకొప్పులేసి
వాన …
వాగుల్ల వంకల్ల నా తెలంగాణా, నా తెలంగాణా
సూపు రాలిన కండ్లు నా తెలంగాణా, నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు
పాలపిట్టలజూసి పడుసుసప్పట్లు
కొత్త …
పాలపిట్టలజూసి పడుసుసప్పట్లు
జొన్నకర్రల జండ జోరున్నదేమి
జొన్న …
అలై బాలై తీసె నా తెలంగాణా, నా తెలంగాణా
జమ్మి పంచిన ఆర్తి నా తెలంగాణా, నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

మోటగొట్టే రాత్రి మోగిన పాట
తాడుబేనిన తండ్రి తలుపులున్నప్పు
మోట …
తాడుబేనిన తండ్రి తలుపులున్నప్పు
కల్ల ముడిసిన అవ్వ కలలోని గింజా
కల్ల …
ఆరుగాలం చెమట నా తెలంగాణా, నా తెలంగాణా
ఆకలి దప్పుల మంట నా తెలంగాణా , నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

ఊరుగాచే తల్లి ఉరిమీజూడంగా
బువ్వలేని తల్లి బోనమొండిందీ
ఊరుగాచే …
బువ్వలేని తల్లి బోనమొండిందీ
సేనుకొచ్చిన పురుగు సెరిగిపోసిందా
సేను …
బోనాల పండుగ నా తెలంగాణా, నా తెలంగాణా
కాట్రావుల ఆట నా తెలంగాణా , నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

దట్టి గట్టిన రోజు డప్పు సప్పుల్లు
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
దట్టి …
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
కుడుక పేర్లమొక్కు కూలి బత్కుల్లు
కుడుక …
ఆలువాడిన పాట నా తెలంగాణా, నా తెలంగాణా
ఆత్మ గల్లా చెయ్యి నా తెలంగాణా , నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

కలిసేటి సేతుల్ల కన్నీటి పాట
సిందోల్లసిందుల్ల సిగురించే నాట్యం
కలిసేటి …
సిందోల్లసిందుల్ల సిగురించే నాట్యం
ఒగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం
ఒగ్గు …
కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణా
పాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

తాడుబేనిన బతుకుతండ్లాటసూడు
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
తాడు …
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
నీళ్ళులేని చెరువు నినుజూసి నవ్వే
నీళ్ళు …
బతికిసెడ్డాబిడ్డ నా తెలంగాణా, నా తెలంగాణా
తల్లడిల్లే తల్లి నా తెలంగాణా , నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…

బురుజుగోడల పొగరు మెడలు వంచంగా
పుట్లల్ల సెట్లల్ల గోగుపువ్వుల్లూ
బురుజు …
సద్దిమోసిన తల్లీ సావుబతుకులు
పానమిచ్చిన వీరకథలు పాడంగా
పాన …
గోరుకొయ్యల పొద్దు నా తెలంగాణా, నా తెలంగాణా
గోరింకలా సభలు నా తెలంగాణా , నా తెలంగాణా
నాగేటి సాల్లల్ల…