Tuesday, September 04, 2007

తెలంగాణ జీవనాడిని ధ్వనించే పాలపిట్టల పాటలు : ప్రాణహిత


వచన కవిగా వరవరరావు తెలుగు సాహిత్య లోకంలో చిర ప్రముఖులు. చలి నెగళ్ళు నుండి ఉన్నదేదో ఉన్నట్టు వరకు అనేక కవితా సంపుటులని ప్రకటించిన వరవరరావు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలని సాహిత్యం ద్వారా ఆచరణ ద్వారా నిరంతరం ప్రవహించే జీవనది. ఎప్పటికప్పుడు ప్రజలనాడిని ప్రతిధ్వనించడంలో అణగారిన ప్రజలకు గొంతునివ్వడంలో అందరికన్నా ఒక అడుగు ముందే ఉండే వరవరరావు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు, ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల సజీవ భాషలో, ప్రజల హృదయస్పందనైన పాట ద్వారా రూపమిచ్చారు. సాధారణంగా వచనకవులు తమ వచనకవితా రూపాన్ని దాటి ప్రజల పాట రూపంలో రాయడం అరుదు. ఆ పని చాల కొద్ది మంది కవులే చేసారు. వాళ్లలో చేరిన వరవరరావు అద్భుతంగా తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, ప్రజాస్వామిక తెలంగాణ ఆవశ్యకతనూ పాటలుగా కట్టారు. ఆ పాటలని ప్రముఖ ప్రజా గాయకులు సంధ్య, విమల, ప్రభాకర్, పుష్ప తదితరులు గానం చేయగా ‘పాలపిట్టల పాటలు’, ‘తెలంగాణ వీరగాధ – బతుకమ్మ పాట’ అనే రెండు సి. డి. లు గా వెలువరించారు. ఈ పాటల సంకలనాల్లో ఒకటైన ‘తెలంగాణ వీరగాధ’ కు ఎన్.వేణుగోపాల్ ముందు మాట రాసారు. ‘పాలపిట్టల పాటల’కు అల్లం నారాయణ ముందుమాట రాసారు