Sunday, May 06, 2007

A Poem By Sree Sree


పొలాల నన్నీ, హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ –
జగానికంతా సౌఖ్యం నిండగ –
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి, ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !

నరాల బిగువూ
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని -
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ - పరిప్లవిస్తూ
ధనిక స్వామికి దాస్యం చేసే,
యంత్ర భూతముల కోరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోయ్ !

...................................

...................................

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీరకష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు –
నా వినుతించే - నా విరుతించే
నా వినిపించే నవీన గీతికి,
నా విరచించే నవీన రీతికి,
భావ్యం ! భాగ్యం ! ప్రాణం ! ప్రణవం !

- శ్రీ శ్రీ తేదీ: 7 - 5 – 1937