Saturday, July 28, 2007

తెలంగాణ వీరగాథ : బతుకమ్మ పాట : రచన: వరవరరావు

ఇది కొత్త బతుకమ్మ పాట, సాగవలసిన బాట
2007 ప్రాణహిత

http://discover-telangana.org/wp/2007/06/27/telangana_veeragaatha_bathukamma_paata

బతుకమ్మ తెలంగాణకు సంకేతం. బతుకును అమ్మగా సంభావించి, పూలలో, ఆకులలో, నీటిలో, ప్రకృతిలో ఆమెను దర్శించి తొమ్మిదిరోజులపాటు ఆటపాటలతో కొలవడం తెలంగాణలో మాత్రమే ఉన్న సంప్రదాయం. బతుకమ్మ పాటలలో సామూహిక గానం ఉంది. సంగీతం ఉంది. నృత్యం ఉంది. జీవితం ఉంది. ఆ పాటలలో తెలంగాణ స్త్రీలు తమ బతుకులను పాడుకుంటారు, తమ ఆనందాలనూ విషాదాలనూ పాడుకుంటారు, ఏడేడు తరాల కథలనూ గాథలనూ తవ్విపోసుకుంటారు. కుటుంబంలోని దుఃఖాన్నీ, దొరల పాలనలోని కష్టాల్నీ, ప్రకృతి వైపరీత్యపు కడగండ్లనూ సామూహికంగా పాడుకుంటారు. కుటుంబ జీవనంలోని సంతోషాన్నీ, పిల్లల ముద్దుముచ్చట్లనూ, పంటచేల వయ్యారాలనూ, వీరుల త్యాగాలనూ, దేవతల దయనూ, శృంగారాన్నీ, కరుణనూ, హాస్యాన్నీ బతుకమ్మ పాటలలో కలగలిపి తలపోసుకుంటారు, వలపోసుకుంటారు. మరిచిపోయిన అనుబంధాలయినా, మరవలేని సంబంధాలయినా, అప్పటికప్పుడు ప్రతీకారంతీర్చుకోలేని కోపాలయినా, వ్యంగ్యంగా వెలువడే అధిక్షేపమయినా, ఎప్పటికప్పుడు ప్రేరణగానిలిచే యోధుల జ్ఞాపకాలయినా బతుకమ్మ పాటలకెక్కవలసిందే. వందల ఏండ్ల వెనుకటి సమ్మక్క సారలమ్మ వీరగాథ అయినా, నిన్నమొన్నటి ఐలమ్మ సాహసం అయినా, కళ్లముందరి నెత్తుటి కాల్వల సజీవ కవోష్ణ స్మృతులయినా బతుకమ్మ పాటలకెక్కవలసిందే.
తెలంగాణ జన జీవితాన్నంతా ఇంత బలంగా తనలో రంగరించుకున్న బతుకమ్మపాటలోకి తెలంగాణ చరిత్ర ఇంతవరకూ ఎక్కినట్టులేదు. ఒక్కొక్క పువ్వూవేసినట్టు తరతరాల తెలంగాణ చరిత్రను విప్పిచెప్పి ప్రత్యేకతెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను నొక్కిచెప్పే ప్రయత్నం ఈ ‘ఒక్కేసి పువ్వేసి సందమామ’ బతుకమ్మపాట. ‘తెలంగాణ చరితాను సందమామ, తెలియజెప్పుతాను సందమామ’ అంటూ మొదలయి ఒక్కొక్క జాముకు ఒక్కొక్క పూవు వేస్తూ మూడువేలఏండ్ల తెలంగాణ జాతి చరిత్రను చెపుతుందీ పాట. మొదటి జాము పాట తెలంగాణ నేలమీద జనజీవనం ప్రారంభమయినప్పటినుంచి తెలంగాణ చరిత్రలో మహోజ్వలమైన తెలంగాణ రైతాంగ సాయుధపోరాట విజయాలదగ్గర ముగుస్తుంది. రెండో జాము పాట పోలీసు చర్య పేరిటి సైనిక పాలన గురించి చెపితే, మూడోజాము పాట ముల్కీ ఉద్యమం నాటినుంచి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా సాగిన పరిణామాల్ని చెపుతుంది. నాలుగో జాము పాట తెలంగాణ స్వయం నిర్ణయాధికార ఉద్యమంలో కలికితురాయి అయిన 1969 ప్రజాప్రజ్వలనాన్ని వివరిస్తుంది. ఐదో జాము పాట తెలంగాణ ప్రజా ఆకాంక్షలలోనే పుట్టిపెరిగి సమాంతరంగా ఈ నేలమీద వెల్లువై సాగిన ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని వివరిస్తుంది. ఆ రెండు ఉద్యమాలకు సారభూతమైన ప్రజల ఆకాంక్షలమధ్య సారూప్యతను చెపుతుంది. ఆరోజాము పాట మళ్లీ మొదలయిన ప్రత్యేకతెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమపు విస్తృతిని వివరిస్తుంది. ఏడోజాము పాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవలసిన అవసరాన్ని చెప్పడంతో ముగుస్తుంది.
ఇది కొత్త బతుకమ్మపాట. బతుకమ్మనేలపై కొత్త కోరికల పాట. కొత్త శపథాల బాట. తెలంగాణ ప్రజల స్వయంపాలనకోసం, తెలంగాణ వనరులమీద తెలంగాణ భూమిపుత్రుల అధికారంకోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ అస్తిత్వంకోసం తెలంగాణ ప్రజల పాట. మరువరాని చరిత్రను నేర్పే పాట. సాగవలసిన చరిత్రబాట.