చందమామ రావే
చందమామ రావే - జాబిల్లి రావే!
చందమామ రావే - జాబిల్లి రావే!
కొండెక్కి రావే - గోగు పూలు తేవే!
బండిమీద రావే - బంతి పూలు తేవే!
పల్లకిలో రావే - పంచదార తేవే!
సైకిలేక్కి రావే - చాక్లెట్లు తేవే!
పడవమీద రావే - పట్టుతేనే తేవే!
పెందలాడే రావే - పాలు పెరుగుతేవే!
మంచి మనసుతో రావే - ముద్దులిచ్చిపోవే!
అన్నియునుతేవే - మా అబ్బాయికీయవే
చెమ్మ చెక్క...
చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ
అట్లు పోయంగ, ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగ
పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ
చూచివద్దాం రండి సుబ్బరాయుడి పెండ్లి
మా వాళ్లింట్లో పెళ్ళి, మళ్ళి వద్దాం రండి
దొరగారింట్లో పెళ్ళి దోచుకువద్దాం రండి
చేత వెన్న ముద్ద - చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు - పట్టుదట్టి
సందిట తాయత్తులు - సిరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణా నిన్ను - చేరి కొలుతు
తారంగం తారంగం...
తారంగం తారంగం - తాండవ కృష్ణ తారంగం
వేణునాదం తారంగం - వెంకట రమణ తారంగం
వెన్నదొంగ తారంగం - చిన్నికృష్ణా తారంగం
దాగుడుముతలు...
దాగుడు మూత దండాకోర్
పిల్లి వచ్చె ఎలుకా దాగే
ఎక్కడి దొంగలు అక్కడనే
గప్ చిప్ సంబారు బుడ్డి
కళ్ళూ మూసి కాలీకోర్
ఎక్కడి దొంగలు అక్కడనే
అడుక్కో - బుడుక్కో సంబారు బుడ్డీ
గప్ చిప్ - గప్ చిప్.
బడి నుంచి అమ్మ ఒడికి
బడికి మనం వెళ్లుదాం
ఆటలెన్నో ఆడుదాం
పదములెన్నో పలుకుదాం
పాటలెన్నో పాడుదాం
అక్షరాలు దిద్దుదాం
అమ్మ ఒడిని చేరుదాం
బుజ్జి మేక
బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివీ?
రాజు గారి తోటలోన మేత కెల్తినీ.
రాజు గారి తోటలోన ఏమి చూస్తివీ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తినీ!
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా?
నోరూరగా పూల చెట్లు మేసివస్తినీ .
మేసివస్తే నిన్ను భటులు ఏమిచేసిరి?
భటులు వచ్చి నాకాళ్ళు విరుగగొట్టిరీ.
కాలు విరిగిన నీవు ఊరకుంటివా?
మందుకోసం నేను డాక్టరింటికెళ్తినీ.
మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివీ?
చిక్కనైన తెల్ల పాలు అందిస్తినీ..
ఉన్న పాలు డాక్టరుకిస్తే యజమాని కేమిస్తవూ?
గడ్డి తినక ఒకపోట పస్తులుండి తీరుస్తా.
పస్తులుంటె నీకు నీరసం రాదా?
పాడు పని చేయనింక బుద్దివచ్చెనాకు.