Sunday, October 07, 2007

వీడ్కోలు గీతం


ఒక స్నేహితుడు job resign చేసి Phd నిమ్మిత్తం వెళ్ళిపోతున్నాడు. అతని పరంగా చూస్తే కొత్త మార్గంలో ప్రయాణం. కానీ అదే పాత అతను. అందరికీ దూరంగా, దేశం కానీ దేశంలో ఉండాలి. ఈ నిర్ణయం సరి అయినదా, కాదా అనే సందేహంలో ఉన్న మనస్థితి. ఇందులో కొంత బాధ ఉంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ, అందరిలా ఉండకుండా మనసుకి నచ్చిన దానికై ఈ పరుగులు అనర్థమేమో అన్న భయం ఉంది. అసలు ఇంతా చేసి ఈ కొత్త అనుభవం తనకు సంతృప్తి కలిగిస్తుందా, లేదా? ఏమో, అనుభవం అయితే గానీ తెలియదు. ఈ భావాలు అన్నీ పేర్చి రాసిన కవిత.

రాత్రికి వీడ్కోలు పగలుకు స్వాగతం
తూరుపు మాత్రం ఒకటే
కొత్త దారి, కొత్త నడక
కాళ్ళు మాత్రం పాతవే
కొత్త ఆశలు, కొత్త బంధాలు
జీవితం మాత్రం అదే

మబ్బుతో బంధాన్ని తెంచుకోడం
చినుకుకు కష్టమే
అయినా, చినుకుకి తెలుసు
తన ఉనికి పరమార్థం
నేలకి దాహం తీర్చడమని,
పయనమవ్వక తప్పదని

దారితెన్నూ లేక తిరుగుతోందనిపించినా
నిజానికి కొండవాగుకి తన గమ్యం తెలుసు
ఎప్పుడూ ఒకచోటే పడి ఉండే చెరువులకి
నచ్చిన చోటుకి పరిగెత్తి చేరుకోడంలోని ఆనందం
ఎప్పటికీ తెలియదు!


ఎన్ని మలుపులు బ్రతుకులో!
ప్రతి మలుపూ పాత దారిని కప్పేస్తూనే
కొత్త దారిని చూబెడుతోంది
వెలుగురేఖల్ని మింగే చీకటి కూడా
జాబిల్లి వెన్నలని ఇస్తూనే ఉంది

జీవితం ఒక అన్వేషణ
అలుపులేని పరిశోధన
నడక మొదలెట్టేదాకా
మనకేం కావాలో మనకే తెలియదు!