ఏ ఒడిదొడుకులు, వత్తిళ్లు లేకుండా ప్రశాంతంగా సాగిపోవడమే జీవితమని భ్రమపడే మందజీవుల్లో ఒకడు కాదు శాంటియాగో అనే యువకుడు. అతనికి ప్రయాణాలంటే ఇష్టం. గొర్రెల కాపరిగా కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చని తండ్రి ద్వారా తెలుసుకుని, తండ్రి ఇచ్చిన మూడు బంగారు నాణేలతో గొర్రెలను కొని ప్రయాణాలు సాగిస్తుంటాడు. తన గొర్రెలకు పుస్తకాలు చదివి వినిపిస్తూ, తాను చూసిన వింతలను వాటికి వర్ణించి చెబుతుంటాడు. అలా రెండేళ్లు గడిచిపోతుండగా అతన్ని ఒక కల వెన్నాడుతుంది. స్పెయిన్ లో ఒక పాడుబడిన చర్చిలో గొర్రెలతో పాటు నిద్రించిన ఆ యువకుడికి ఆ రాత్రి రెండోసారి అదే కల వచ్చింది. ఆ కల గురించి తెలుసుకోవడానికి బంజార ముదుసలిని, వృద్ధరాజును కలుస్తాడు. ఆ కలకు అర్థం ఆఫ్రికాలోని పిరమిడ్ల వద్ద ఆ యువకునికి నిధి దొరుకుతుందని వారిద్దరు చెబుతారు.
ఎన్నో శకునాల మధ్య, హృదయం మాట వింటూ, విశ్వాత్మ భాష నేర్చుకుని, ఆపదలెన్ని ఎదురైనా ఒయాసిస్సులో, ఎడారిలో ప్రయాణాలు చేసి ఈజిప్టులోని పిరమిడ్ల చెంతకు చేరుతాడు. అతని ఒక్కో మజిలీ సాహసోపేతమైన ఒక్కో అద్భుత అనుభవ గాథ. ఆ అనుభవాలే అతని నిధి అనిపిస్తుంది. ఆ అనుభవ గాథలో మనల్ని మనం మరిచిపోయి, ఆ గొర్రెల కాపరి వెంట మనం నడుస్తుంటాం, ఆ యువకుడు మనకు చిరకాలంగా తెలిసినట్టు. కాని మరుక్షణంలోనే మన జీవిత గమ్యాన్ని చేరడానికి మనం ప్రయత్నిస్తున్నామా అని మనలో ప్రశ్నలు వుదయిస్తాయి. మనం అశాంతికి గురయి, మరచిపోయిన మన జీవిత గమ్యాన్ని తిరిగి గుర్తు చేసుకుంటాం.
“బాల్యంలో అందరికీ జీవిత గమ్యం ఏమిటో తెలుస్తుంది. ఆ వయసులో అంతా స్పష్టంగా ఉంటుంది. అన్నీ సాధ్యమే అనిపిస్తాయి. వాళ్లు కలలు కనడానికి భయపడరు. తమ జీవితంలో కావాలనుకున్న దానికోసం ఆశతో ఎదురు చూస్తుంటారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ తమ జీవిత గమ్యాన్ని సాధించటం అసాధ్యమని వాళ్లు నమ్మేలా ఒక వింత శక్తి ఏదో చేస్తుంది.”
“… చివరికి మనుషులు తమ జీవిత గమ్యం కంటే… ఇతరులు ఏమి అనుకుంటారో అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.” కాని మన యువకుడు తన జీవిత గమ్యం వైపు ప్రయాణం కొనసాగిస్తాడు.
గొర్రెలను అమ్మి, ఆ డబ్బుతో ఓడ నెక్కాలని టాంజియార్ చేరుకుంటాడు. కాని ఒక కొత్త వ్యక్తి మోసానికి గురయి డబ్బంతా పోగొట్టుకుంటాడు. కొత్త వ్యక్తిని నమ్మినందుకు “ ప్రపంచం ఎలా వుందో కాక, ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆ దృష్టి కోణం నుంచి చూసే అందరిలాంటి వాడినే నేను కూడా” అనుకుంటాడు. అంతలోనే “నువ్వు ఏదైనా కావాలని అనుకున్నప్పుడు దానిని నువ్వు సాధించడంలో సహాయపడే విధంగా ఈ విశ్వమంతా కుట్ర పన్నుతుంది” అన్న వృద్ధరాజు మాటలను గుర్తు చేసుకుని, మనసును తేలిక చేసుకుంటాడు.
గాజు వస్తువులు అమ్మే ఒక వ్యాపారి వద్ద పనికి కుదురుకుంటాడు. ఆ పనిలో లీనమైపోయి, ఎలా చేస్తే లాభాలు పొందవచ్చో వ్యాపారికి చెప్పి దాన్ని లాభసాటి వ్యాపారంగా మారుస్తాడు. వ్యాపారి తన లాభాల్లో అనుకున్న వాటా మన యువకుడికి ఇస్తాడు. అలా పదకొండు నెలలు గడిచేసరికి చాలా డబ్బు గడిస్తాడు. ఆ డబ్బు తీసుకుని తిరిగి తన జీవిత గమ్యం వైపు పయనిస్తాడు. నిజానికి చాలా మందికి ఇలాంటి పరిస్థితి సంభవిస్తే ఇదే బాగుందిలే అని జీవిత గమ్యాన్ని అలవోకగా మరిచిపోయే ప్రమాదం వుంటుంది. గాజు సామాన్ల వ్యాపారి ఎన్నో ఏళ్లుగా మక్కా పోవాలనుకున్నా వెళ్లలేకపోయానని బాధపడతాడు. జీవిత గమ్యాన్ని చేరలేని వారు దాన్ని సాధించలేకపోయామనే దాని కన్నా జీవిత గమ్యం కోసం ప్రయత్నించలేదని ఎక్కువ బాధపడడం ఆ గాజు వ్యాపారిలో చూస్తాం.
“నేర్చుకోవడానికి ఒకటే దారి ఉంది: అది చర్యల ద్వారా” అంటాడు పరుసవేది. తాత్వికస్థాయిలో జీవితాన్ని విశ్లేషించిన గొప్ప పుస్తకం “పరుసవేది” (ది ఆల్కమిస్ట్ ).
“మనం చాలాసార్లు పక్కదార్లు తీసుకుంటున్నా అంతిమంగా గమ్యం వైపుకే పురోగమిస్తున్నాం.” అంటాడు యువకుడితో పాటు ఎడారిలో తోడుగా ప్రయాణిస్తున్న పరుసవేది.
ఎడారిలో యుద్ధాల మధ్య నుంచి ఒయాసిస్సుకు పోతుండగా ఒంటెను నడిపించే వ్యక్తి యువకుడితో ఇలా అంటాడు. “నేను అటు గతంలోనో, ఇటు భవిష్యత్తులోనో జీవించడం లేదు. ప్రస్తుతంపైనే నాకు ఆసక్తి వుంది. ఎప్పుడు ప్రస్తుత క్షణం పైనే దృష్టి నిలపగలిగితే, నువ్వు అదృష్టవంతుడివవుతావు. ఎడారిలో జీవం వుందని, ఆకాశంలో చుక్కలున్నాయని, మానవజాతిలో భాగం కాబట్టి, ఎడారి జాతులు సంఘర్షించుకుంటున్నాయని నువ్వు గమనిస్తావు. అలాంటప్పుడు జీవితం నీకు ఒక అద్భుతమైన విందు అవుతుంది. ఎందుకంటే మనం గడుపుతున్న ప్రస్తుత క్షణమే జీవితం.”
యువకునికి జీవిత గమ్యం చేరేలోగా మూడుసార్లు వున్నదంతా పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకొనే పరిస్థితులు సంభవిస్తాయి. అయితే అదే సమయంలో ఆ యువకుడికి మార్గ మధ్యంలో కలిసిన ఆంగ్లేయుడు, ఫాతిమా, పరుసవేది అతని జీవిత గమ్యానికి తోడ్పడుతారు.
ఎడారిలో ప్రయాణం, ఒయాసిస్సులో జీవితం కష్టసుఖాల పల్లవిగా మనల్ని అద్భుతపరుస్తుంది. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు స్వేచ్ఛతో కూడిన స్వచ్ఛమైన తాత్వికతను ఆస్వాదిస్తూ పదేపదే మన జీవిత గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ, జీవిత అనుభవాలను మననం చేసుకుంటాం. అంతేకాదు, ఒకసారి చదివి పుస్తకాన్ని బుక్ షెల్ఫ్ లో పెట్టేయలేం. మళ్లీ మళ్లీ చదవాలనుకుంటాం. ఏ పేజీలోంచి మొదలుపెట్టినా, ఆ తాత్విక చర్చలో లీనమైపోయి, మళ్లీ మళ్లీ పుస్తకం చివరికంటా చదువుకుంటూ పోతాం.
అంతిమంగా మనం మన హృదయాన్ని వింటున్నామా లేక హృదయం వున్నదన్నదే మరిచిపోయామా అని తరచి చూసుకుంటాం. మన హృదయం మన చుట్టూనే తిరుగుతోంది. కాని రణగొణ ధ్వనుల మధ్య మన హృదయాన్ని ఆలకించడం మరచిపోతున్నాం అనుకుంటాం. ఎక్కడ మన హృదయం వుందో అక్కడే నిధి వుందని తెలుసుకుంటాం. “ఒకరి జీవిత గమ్యానికి అడ్డుపడేవారు వారు తమ జీవిత గమ్యం ఎప్పుడూ చేరుకోలేరు.” “ప్రతి ఒక్కరూ తమ నిధి కోసం వెతికి, దానిని సాధించాలి. ఆ తరువాత గత జీవితంలో కంటే తమను తాము మెరుగు పరుచుకోవాలి. తన అవసరం ఉన్నంతవరకు సీసం తన పాత్ర పోషిస్తుంది, ఆ తరువాత అది బంగారంగా మారాల్సి వుంటుంది”. “ప్రేమ అనేది ఒక శక్తి. అది విశ్వాత్మను మార్చి మెరుగు పరుస్తుంది… విశ్వాత్మను పెంచి పోషించేది మనమే. మనల్ని మెరుగుపరచుకుంటామా, క్షీణింపచేసుకుంటామా అన్న దాన్ని బట్టి మనం నివసించే ప్రపంచం మెరుగుపడుతుంది లేదా క్షీణిస్తుంది”.
పాలో కొయిలో పోర్చుగీసులో రాసిన ‘ది ఆల్కమిస్ట్ ‘ని తెలుగు పాఠకులకు అందించిన ‘మంచి పుస్తకం’ వారికి అభినందనలు