Sunday, March 16, 2008

వయసుతో పని ఏముంది?

ఏ వయసుకా ముచ్చట అన్నారు పెద్దలు. అంటే ఏ వయసుకైనా ముచ్చట్లు ఉంటాయన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం అన్నమాట. మరి ఆ ముచ్చట్లు ఎలా ఉండాలి?

చిన్న వయసువాళ్ళకైతే ఆటలు, పాటలు, అల్లరి. మధ్య వయస్కులకు ఆటలు, పాటలు, కబుర్లు. వృద్ధులకు కూడా ఆటలుంటాయి, పాటలుంటాయి, వాటితోపాటు వారు తలచుకుంటే అనేక రకాలైన ముచ్చట్లుంటాయి.


వయసుకు తగ్గ ముచ్చట్లు అనేది ఉద్యోగం-సద్యోగాలకీ, పెళ్ళి పేరంటాలకీ సంబంధించినవని మన పెద్దోళ్ళ భావన. ఖాళీగా తిరగకుండా త్వరగా సంపాదనపరుడవైతే జీవితంలో త్వరగా స్థిరపడతావు, తద్వారా సరైన వయసులో వివాహం అవుతుందనేది దీని వెనుక ఉన్న నిగూఢమైన అర్ధం. ఆ రెంటి వరకైతే అది బాగానే ఉంది. ఐతే ముచ్చట్లకు వయసనేది ఉండదని ఉండదు. ముచ్చట్లు అంటే కేవలం కాలక్షేపం కబుర్లని అర్ధం కాదు. రిటైరైపోయాం కాబట్టి మాకింక పనేమీ లేదు అనుకొకూడదనీ, ఏదో ఒక సరదా అయిన పని చేస్తూ ఉంటే టైము పాస్ అవుతుందనీ తెలుసుకోవాలి.

అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు చూద్దాం.

కాటో అనే వ్యక్తి 80 సంవత్సరాల వయసులో గ్రీకు భాషను నేర్చుకోవడం ప్రారంభించాడు. అంతే కాదు అందులో ప్రజ్ఞావంతుడు కూడా అయ్యాడు.

81 సంవత్సరాల వయసులో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కుదిర్చిన ఒప్పందం కారణంగానే అమెరికా సమ్యుక్త రాష్ట్రాల రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

లియో టాల్స్టాయ్ తన 82వ ఏట "ఐ కెనాట్ బీ సైలెంట్" అనే గ్రంధం రాశాడు.
ఒకనాటి ఇంగ్లండ్ ప్రధాన మంత్రి చర్చిల్ తన 82వ ఏట "ఏ హిస్టరి ఆఫ్ దీ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్" అనే పుస్తకాన్ని రాశాడు.

అలాగే సొమర్సెట్ మాం అనే రచయిత కూడా 84 ఏళ్ళ అయసులో "పాయింట్స్ ఆఫ్ వ్యూ" అనే గ్రంధం రచించాడు.

ఆఫ్రికాకు చెందిన 89 సంవత్సరాల వయసుగల ఆల్బర్ట్ స్కీవిట్జర్ ఒక ఆసుపత్రి సారధ్యాన్ని చేపట్టాడు.

మనందరికీ తెలిసిన జార్జ్ బెర్నార్డ్ షా 93వ ఏట ఫార్ఫెచ్చ్డ్ ఫేబుల్స్ అనే నాటకాన్ని రచించాడు.

94 సంవత్సరాల బెర్ట్రాండ్ రస్సల్ అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలలో చురుగ్గా పాల్గొనేవాడు.

100 సంవత్సరాల వయసుగల మోసెస్ వర్ణ చిత్రాలు గీస్తూ ఉండేది.

112 సంవత్సరాల ఫిజిసావా ఓపెన్ యూనివర్సిటీలో చేరి చదువు కొనసాగించింది.

ఇప్పుడు నమ్ముతారా ఏ వయసుకైనా ముచ్చట్లు ఉంటాయని. అందుకే వయసు మీద పడిపోయిందని దిగులుపడిపోకుండ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే మనసుకి ఉల్లాసంగా ఉంటుందీ, ఆరోగ్యం కూడా బాగుంటుంది.