Monday, June 18, 2007

రచనలే కాదు, జీవితమూ ఆదర్శప్రాయమే! - ఓల్గా

ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, స్వయంకృషి, సృజనాత్మకత వీటన్నిటికీ కలిపి ఒక రూపం వస్తే ఆ మనిషి వాసిరెడ్డి సీతాదేవి. ఎంత పట్టుదల, తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలనే తపన లేకపోతే ఒక చిన్న గ్రామంలో, రోడ్డు దాటి బడికి వెళ్ళడం ఆడపిల్లలకు నిషేధమైన నిర్బంధ సంప్రదాయాల లోంచి మద్రాసు మహా నగరం చేరుతుంది ఒక అమ్మాయి! ఇల్లు విడిచి మహా నగరంచేరి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తృప్తిపడి ఊరుకోలేదా అమ్మాయి.

ఉద్యోగం, సాహితీ వ్యాసంగం, ఉన్నత విద్య సాధించి తెలుగువారు గర్వించ దగిన రచయిత్రిగా, మహిళగా, ఉన్నతాధికారిగా ఎదిగారు సీతాదేవిగారు. వీధిబడిలో చదువు ఆపేసిన ఆమె నాగపూర్ యూనివర్శిటీ నుంచి ఎం ఏ చేశా రు. హిందీలో సాహిత్యరత్న డిగ్రీ సంపాదించారు. స్త్రీ సంక్షేమశాఖలో, యువ జన సేవల శాఖలో ఉన్నత స్థానాలలో పనిచేసి జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా, బాలల అకాడమీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు.
చదువులు, ఉద్యోగాలు ఒక ఎత్తయితే తెలుగు సాహిత్యంలో ఆమె నవల లకు ఉన్న స్థానం మరొక ఎత్తు. ‘సమత’ నవల ఆ రోజు ల్లో పెద్ద సంచలనం. అధికార రాజకీయాలు కలుషితమై పోతున్న తీరును నిర్భయంగా, నిర్మొహమాటంగా చిత్రిం చిన మొదటి నవల ‘సమత’. అప్పటి ముఖ్యమంత్రి సంజీ వయ్యగారు సీతాదేవితో ‘ఏమిటమ్మా నా మంత్రివర్గం లోని వ్యక్తి గురించి రాస్తున్నావు- కానీ బాగా రాస్తున్నా వు’ అన్నారని సీతాదేవిగారు చెప్పారు. ‘మట్టి మనిషి’ నవ ల తెలుగు నవలల్లో ఉత్తమమైన పది నవలల్లో కలకాలం నిలిచి ఉండే నవల. లేడి మాక్బెత్ పాత్రకు తీసిపోని విధం గా చిత్రించిన వరూధిని పాత్ర తెలుగు సాహిత్యంలో చిరంజీవి. స్వాతంత్రం వచ్చాక గ్రామాలలో వచ్చిన మార్పులనూ, గ్రామాలకూ పట్టణాలకూ మధ్య శిథిల మవుతున్న మానవ సంబంధాలనూ వాస్తవికంగా చిత్రిం చటంలో సీతాదేవిగారు చూపిన ప్రతిభ అపూర్వం. అసాధారణం.
ఆడపిల్లలకు ఆస్తిహక్కు అవసరాన్ని చెబుతూ వైతరణి నవలనూ, వరకట్న హింస గురించి ‘ఉరితాడు’ నవలను రాశారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను ఆమూలాగ్రం పట్టి చూపే నవల రాబందులు- రామ చిలుకలు. ఏ నవల రాసినా అందులో అభ్యుదయ భావాలనూ, శాస్త్రీయ దృక్పథాన్నీ, మానవ మనస్తత్వ వాస్తవిక చిత్రణ ఉండి తీరవలసిందే. చిన్నతనంలో పల్లెటూరిలో ఆడపిల్లగా నిర్బంధాలనెదుర్కొన్న సీతాదేవి రచయిత్రిగా ఎదిగాక నిషేధాలను ఎదుర్కొన్నారు. ఆమె రాసిన ‘మరీచిక’ నవ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఆ నిషేధాన్ని ధైర్యంగా సవాలు చేసి గెలిచారు సీతాదేవి. మామూలుగా స్త్రీల జీవితంలో జరిగే వివాహం, కుటుంబం, పిల్లలు ఇటువంటి బంధనాలలో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా జీవిం చారు. వ్యక్తిగత జీవితంలోనూ, ఉద్యోగజీవితంలోనూ ఆమె ఎదురులేని మని షి. నిర్మొహమాటి. రాజీపడని తత్త్వం. మంచి స్నేహశీలి. తోటి రచయితలతో, రచయిత్రులతో తరతమ భేదాలు లేకుండా స్నేహం చేయగలిగిన వ్యక్తి. తన దృక్పథాలు, అభిప్రాయాల విషయంలో ఎంత నిర్మొహమాటంగా మాట్లాడతా రో, స్వంత విషయాల్లో అంత మొహమాట పడతారు.
తన రచనలను విమ ర్శిస్తే మొదట కోపం తెచ్చుకున్నా వెంటనే ఆ కోపాన్ని మరిచిపోయి నవ్వుతూ మాట్లాడేవారు. “మీ ‘ఉరితాడు’ ‘మట్టిమనిషి’లా లేదు. నాకు నచ్చలేదు’ అంటూ విమర్శించాను ఒకసారి. ‘ఒక నవలలా మరొక నవల ఎలా ఉంటుంది’ అంటూ కోప్పడ్డారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ విమర్శ వల్ల మా స్నేహంలో దూరం రాలేదు. అంత పేరున్న రచయితలు సామాన్యంగా తాము వేదిక మీద ఉంటే తప్ప సాహిత్య సభలకు రారు. సీతాదేవిగారు ఎంత అనారోగ్యంగా ఉన్నా ఓపిక చేసుకుని తోటి రచయిత్రు లకు జరిగే గౌరవ సత్కారాలను చూడటానికి వచ్చి సంతోషించేవారు. ఈ సంవత్సరం జనవరిలో రవీంద్ర భారతిలో జరిగిన ఓ సభలో ఆమె చాలా ఆయాస పడ్డారు. పది నిముషాలుండి వెళతానన్నారు. కానీ పూర్తిగా కూర్చున్నారు. ఆమెకు మనుషులు కావాలి. నలుగురితో నవ్వుతూ మాట్లాడాలి. స్నేహితులు కావాలి. నిండుగా, ఠీవీగా, ధీమాగా కనిపించే సీతాదేవిగారిని చూసుకుని రచ యిత్రులందరూ ధీమాగా ఉండేవారు.
ఇప్పుడు సీతా దేవిగారు లేరంటే ఎంత వెలితిగా ఉందో. రచయిత్రులకు ఒక పెద్ద దిక్కు, అండా పోయినట్లయింది. సీతాదేవిగారు అందుకున్న గౌరవ సత్కారాలకూ అవా ర్డులకూ లెక్కలేదు. ఆమె సలహా తీసుకోని సంస్థలూ లేవు. సాహిత్య ఎకాడమీ ఉమెన్ రైటర్స్ ఎడ్వయిజరీ బోర్డులో ఇరవై సంవత్సరాలు పనిచేశారు. ఏ పని చేసినా, ఏ పదవి లో ఉన్నా దానికి వన్నె తీసుకువచ్చేంత కృషి చేయటమే ఆమెకు తెలుసు. గర్వంలేని ఆత్మవిశ్వాసం ఆమె స్వంతం. ఆమె జీవితానుభవాలను ఒక పుస్తకంగా రాయమని ఎన్నోసార్లు అడిగాను. ఆమె ఆస్పత్రిలో చేరటానికి పది రోజుల ముందు కూడా అడిగాను. ‘నాకూ రాయాలని ఉంది. ఆరోగ్యం బాగుపడ్డాక రాస్తాను’ అన్నారు. యాభై, అరవై దశాబ్దాలలోని సాహితీ దిగ్గజాలతో కలిసి పనిచేసిన, వారి మెప్పు పొందిన అనేక సంఘటనలను, సందర్బాలనూ ఆమె చెబుతుంటే వినటం తప్ప రికార్డు చేయలేకపోయామే అని ఇప్పుడు దిగులుగా ఉంది. ఆమె అపారమైన జీవితానుభవం ఆమె రచనలలో కనిపిస్తుంది. ఆమె రచ నల గురించి కొన్ని పరిశోధనలు జరిగాయిగానీ తెలుగు సాహిత్యంలో వాసి రెడ్డి సీతాదేవి గారి స్థానం గురించీ, తెలుగు సాహిత్యానికి ఆమె చేసిన కాంట్రి బ్యూషన్ గురించి ఉత్తమ శ్రేణి విశ్లేషణ ఇంకా జరగవలసే ఉంది. ఆమె జీవి తం, రచనలూ రెండూ స్త్రీలకు ఆదర్శప్రాయమైనవే. ప్రభావితం చేయగలిగిన చేవ ఉన్నవే. వాటిని ఇప్పటి తరానికి అందించాల్సిన బాధ్యత రచయిత్రుల మీద ఉంది.

( వివిధ సాహిత్య పత్రిక సౌజన్యంతో )