అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.
ఒక వ్యక్తి శీలాన్ని, గుణగణాలను అతడు పెంచుకున్న స్నేహాన్నిబట్టే నిర్ణయించగలం. ఒకరితో స్నేహం కలుపుకుని చెలిమిని పెంచుకోవాలని నిర్ణయించుకుంటే వారి స్థితిగతులను, జీవిత సరళిని, మనోవైఖరిని, వారి అలవాట్లను, అభ్యాసాలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం.
అసలైన మిత్రులు మన స్వభావాన్నిబట్టి, గుణాన్నిబట్టి ఏర్పడుతున్నారుగానీ మనం ఇచ్చేదాన్నిబట్టి ఏర్పడడం లేదు. ఎక్కువ మంది స్నేహితులతో సౌభ్రతృత్వంతో సుఖమయంగా జీవించాలంటే ముఖ్యంగా గమనించదగ్గవి.....
ఓర్పు, పట్టుదల: మంచి చెలిమితో స్నేహాన్ని బాగా పెంచుకోవాలంటే పట్టుదల ముఖ్యంగా ఉండాలి. పట్టుదలకు తగిన ఓర్పు కూడా అవసరం. సహనబుద్ధి లేకపోతే స్నేహం విడిపోతుంది.
సౌహార్ద్రత, విశాల హృదయం: స్నేహితుల ప్రవర్తన అన్ని వేళల్లోనూ ఒకే రకంగా ఉంటుందనుకోలేం. మన చంచల బుద్ధికే ఒక్కొక్కప్పుడు వారి ప్రవర్తన తప్పుగా అనిపించవచ్చు. వారి పొరపాట్లను, లోపాలను పట్టించుకోకూడదు. మొండి వాదాలు పెంచుకోకూడదు.
సత్యసంధత: ఇప్పటికైనా జయించేది సత్యమే. నిజమెప్పుడూ దాగదు అనేమాట మరచిపోకూడదు. స్నేహితుల మధ్య ఇబ్బందులు, కలతలు, చికాకులు కలగకుండా ఉండాలంటే అబద్ధాలు చెప్పకూడదు. స్నేహితుల్లో కనిపించే మంచిని ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి.
సహనభావం: ఎదుటివారిని గౌరవించడం ముఖ్యం. ఇతరులను బాధ కల్గించే చలోక్తులు మంచీ కావు. ఒక్కొక్కప్పుడు ఇవి అపోహలకు దారితీస్తాయి.
నిష్కాపట్యము: నిష్కాపట్యత, యోగ్యత వల్ల చెలిమి చిరకాలం వర్ధిల్లుతుంది. ఈ రెండు గుణాలు మానవుని సహజ స్వభావాలను ప్రకటిస్తాయి.
ధైర్యోత్సాహాలు: పరస్పర స్నేహంతో సాధించలేని జయముండదు. స్నేహితుల నైపుణ్యానికి, శక్తిసామర్ధ్యాలకు అసూయపడకూడదు. స్నేహితుల గుణగణాలను పొగడడం ఉత్తమ స్నేహితుని లక్షణం.
విశాల హృదయంతో నిజాన్ని నిలబెట్టుకుంటూ ఆత్మ సంతృప్తి కోసం మంచిని చేస్తూ స్నేహాన్ని ప్రవృద్ధి చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం తెరిచిన పుస్తకంలా ఉండాలి.